అచ్చతెనుగు నుడికారానికి అభినందన
చందనాలు..
అమ్మతెలుగు మమకారానికి వేలవేల
వందనాలు...
విశ్వమంత విస్తరించిన తెలుగుజాతి
సౌరభాలు...
తిరుమల పాదాల చెంత వెలుగులీను
సంబరాలు...
...ఇదిగిదిగో వడివడిగా అరుదెంచెను ఘన పర్వదినం...
...ఆంధ్రదేశమే పులకించే 'విశ్వ తెలుగు సమ్మేళనం’..!
పల్లవి:
తెలుగు పలుకంటె అమృతము...!
తెలుగు చరితమే అద్భుతము...!
తెలుగు సంస్కృతే సమ్మతము...!
తెలుగు తేజమే శాశ్వతము...!
చరణం-1:
శాసనాలలో పదిలమైన ప్రాచీనకీర్తి - తెలుగు...
శాతవాహనుల, కాకతీయుల శౌర్యదీప్తి -తెలుగు...
అమరావతి పురవీధులందు విజ్ఞానగరిమ - తెలుగు..
విజయనగరమున భువనవిజయ సాహిత్య పటిమ - తెలుగు..!
చరణం-2:
నన్నయార్యుని, నన్నెచోడుని తొలికవితలు - తెలుగు...
అన్నమయ్య, క్షేత్రయ్యల తేట పదకవితలు - తెలుగు...
రామదాసుకు, త్యాగరాజుకు రాగమిచ్చినది – తెలుగు....
దేశభాషలలొ లెస్స ఇదియని రాయలు పలికిన
తెలుగు....!
చరణం-3:
గౌతమి, కృష్ణ, పెన్న,
మంజీర అలల సవ్వడులు -తెలుగు...
కూచిపూడి పదనర్తనలో అందెల రవళులు - తెలుగు...
ఏకశిలపైన దివ్యరథమునే మలచిన ఉలి మన
తెలుగు...
శిల్పవీణపై సప్తస్వరములే పలికించినదీ
తెలుగు…!
చరణం-4:
ఆంధ్ర కేసరి, అల్లూరిల స్వాతంత్ర్య కాంక్ష - తెలుగు...
కోటిరతనాల వీణ మేటి పోరాట దీక్ష - తెలుగు...
భరతమాత ముఖ తిలకమైన మువ్వన్నె పతాకం - తెలుగు...
భారత సాహితి సభలో సుస్థిర జ్ఞానపీఠమీ
తెలుగు...!
--:O:--