Wednesday, December 26, 2012

అచ్చతెనుగు నుడికారానికి అభినందన చందనాలు..!



అచ్చతెనుగు నుడికారానికి అభినందన చందనాలు..
అమ్మతెలుగు మమకారానికి వేలవేల వందనాలు...
విశ్వమంత విస్తరించిన తెలుగుజాతి సౌరభాలు...
తిరుమల పాదాల చెంత వెలుగులీను సంబరాలు...
                ...ఇదిగిదిగో వడివడిగా అరుదెంచెను ఘన పర్వదినం...
                ...ఆంధ్రదేశమే పులకించే 'విశ్వ తెలుగు సమ్మేళనం..!
పల్లవి:
తెలుగు పలుకంటె అమృతము...!
తెలుగు చరితమే అద్భుతము...!
తెలుగు సంస్కృతే సమ్మతము...!
తెలుగు తేజమే శాశ్వతము...!
చరణం-1:
శాసనాలలో పదిలమైన ప్రాచీనకీర్తి - తెలుగు...
శాతవాహనుల, కాకతీయుల శౌర్యదీప్తి -తెలుగు...
అమరావతి పురవీధులందు విజ్ఞానగరిమ - తెలుగు..
విజయనగరమున భువనవిజయ సాహిత్య పటిమ - తెలుగు..!
చరణం-2:
నన్నయార్యుని, నన్నెచోడుని తొలికవితలు - తెలుగు...
అన్నమయ్య, క్షేత్రయ్యల తేట పదకవితలు - తెలుగు...
రామదాసుకు, త్యాగరాజుకు రాగమిచ్చినది తెలుగు....
దేశభాషలలొ లెస్స ఇదియని రాయలు పలికిన తెలుగు....!
చరణం-3:
గౌతమి, కృష్ణ, పెన్న, మంజీర అలల సవ్వడులు -తెలుగు...
కూచిపూడి పదనర్తనలో అందెల రవళులు - తెలుగు...
ఏకశిలపైన దివ్యరథమునే మలచిన ఉలి మన తెలుగు...
శిల్పవీణపై సప్తస్వరములే పలికించినదీ తెలుగు…!
చరణం-4:
ఆంధ్ర కేసరి, అల్లూరిల స్వాతంత్ర్య కాంక్ష - తెలుగు...
కోటిరతనాల వీణ మేటి పోరాట దీక్ష - తెలుగు...
భరతమాత ముఖ తిలకమైన మువ్వన్నె పతాకం - తెలుగు...
భారత సాహితి సభలో సుస్థిర జ్ఞానపీఠమీ తెలుగు...!
--:O:--
నూజిళ్ళ శ్రీనివాస్, సెల్: 94408 36041; email: srinivas.noojilla@gmail.com