Saturday, September 27, 2008

తెలుగు కనపడాలి - తెలుగు వినపడాలి

తెలుగు కనపడాలి - తెలుగు వినపడాలి
పల్లవిః
తెలుగు కనపడాలి - మన తెలుగు వినపడాలి!
తెలుగులోనె మాట్లాడాలి - తెలుగులోనె నడయాడాలి!

చరణం-1
అమ్మపాలతో అందిన భాష
అమృతాలనే చిందెడి భాష
కమ్మనైన మీగడ మన భాష
కావాలోయ్ మనకదియే శ్వాస 11 తెలుగు కనపడాలి11

చరణం-2
చాళుక్యుల ఆదరమందినది
విజయనగరమున ఖ్యాతి పొందినది
తానీషా కొలువందుకున్నది
బ్రౌను దొర ప్రేమ చూరగొన్నది 11 తెలుగు కనపడాలి11
చరణం-3
పాఠ శాలలో, కళాశాలలో
సచివాలయ కార్యాలయాలలో
తెలుగులోనె భాషించాలి
తెలుగులో వ్యవహరించాలి 11 తెలుగు కనపడాలి11

Friday, September 26, 2008

విశాలాంధ్ర మాతా! నమస్తే!

విశాలాంధ్ర మాతా! నమస్తే!

విశ్వజన విజేతా!

నిత్య సంపూజితా! నమస్తే!

నిఖిల లోక వినుతా!



శాతవాహనులు, గజపతులు,

విజయనగర ఘన నరపతులు

ఓరుగంటి కాకతి నుతులు

నీ సేవలోనె మురిసేరమ్మా!



గలగలా పారు గోదారీ

కిలకిలమనేటి కృష్ణ సాగరీ

మురిసి ఎగసేటి మంజీర ఝరి

నీ పాదములనె కడిగేనమ్మా!



నన్నయార్యుని తొలిపలుకులో

అన్నమయ్య పద కవిత కులుకులో

బమ్మెర పోతన భక్తి రచనలో

నీ తెలుగు తేనెలొలికేనమ్మా!