Sunday, November 2, 2008

తెలుగు తల్లికి అందలం

పల్లవిః
తెలుగు తల్లికి అందలం ప్రాచీన మకుటముతో!
తెలుగు జాతికి సంబరం ఘనమైన బహుమతితో!
వీనులకు విందైన పలుకుకు విశ్వ సన్మానం!
తేనెలూరే తెలుగు భాషకు నిత్య వైభోగం!
చరణం-1
శాతవాహన శాసనాలే సాక్షి నిలువంగా
నన్నయాది కవీశ్వరులు ఘన స్వస్తి పలుకంగా
పదము పదమున మధువు చిందిన తెలుగు నుడికారం!
వెలుగులీనుతు చేరుకున్నది మహా ప్రస్థానం!
చరణం-2
జానుతెనుగై జాలువారెను జానపదములలో!
జాణ తెలుగై పల్లవించెను కావ్య రచనలలో!
తేట తెలుగై తేనెలొలికెను భావకవితలలో!
మేటి తెలుగై నిలిచిపోయెను నేటిభాషలలో!
చరణం-3
అంబరాలను తాకి సాగే సంబరాలే సాక్షిగా,
అందరము నిలవాలి నేడు తెలుగు భాషకు రక్షగా!
మాతృభాషను మరచిపోతే లేదు జాతికి మనుగడ!
భావితరములకందజేదాం తెలుగు తీయని మీగడ!