Sunday, November 2, 2008

తెలుగు తల్లికి అందలం

పల్లవిః

తెలుగు తల్లికి అందలం ప్రాచీన మకుటముతో!

తెలుగు జాతికి సంబరం ఘనమైన బహుమతితో!

వీనులకు విందైన పలుకుకు విశ్వ సన్మానం!

తేనెలూరే తెలుగు భాషకు నిత్య వైభోగం!

చరణం-1

శాతవాహన శాసనాలే సాక్షి నిలువంగా

నన్నయాది కవీశ్వరులు ఘన స్వస్తి పలుకంగా

పదము పదమున మధువు చిందిన తెలుగు నుడికారం!

వెలుగులీనుతు చేరుకున్నది మహా ప్రస్థానం!

చరణం-2

జానుతెనుగై జాలువారెను జానపదములలో!

జాణ తెలుగై పల్లవించెను కావ్య రచనలలో!

తేట తెలుగై తేనెలొలికెను భావకవితలలో!

మేటి తెలుగై నిలిచిపోయెను నేటిభాషలలో!

చరణం-3

అంబరాలను తాకి సాగే సంబరాలే సాక్షిగా,

అందరము నిలవాలి నేడు తెలుగు భాషకు రక్షగా!

మాతృభాషను మరచిపోతే లేదు జాతికి మనుగడ!

భావితరములకందజేదాం తెలుగు తీయని మీగడ!

1 comments:

చైతన్య క్రిష్ణ పాటూరు said...

చాలా బావుంది మీ కవిత.

"జానుతెనుగై జాలువారెను జానపదములలో!
జాణ తెలుగై పల్లవించెను కావ్య రచనలలో!
తేట తెలుగై తేనెలొలికెను భావకవితలలో!
మేటి తెలుగై నిలిచిపోయెను నేటిభాషలలో!" - మొదటి మూడు నిజమే కానీ, నాలుగవది జరక్కుండా తెలుగు నాయకులే శాయశక్తులా కృషి చేస్తున్నారు.